అడుగడుగునా దాడులు...ప్రతిక్షణం మరణాలు...
ఒక వైపునుండి బాంబులు....మరో వైపు నుండి షెల్లింగ్లు...
దూసుకొచ్చే సైనికులు....మరణించే ప్రజలు...
ఊళ్లకు ఊళ్ళు మాయం అయిపోతుంటే
వందలకు వందలు శవాలు గుట్టలుగా పోగవుతుంటే
పసిపిల్లలు....వృద్ధులు....గర్భిణి స్త్రీలు...ఏమి చేసారు వీళ్ళు...
తిండి కోసం పని చేసుకుంటూ...రోజు గడిచేందుకు పోరాడుతూ..
బోసి నవ్వులు నవ్వుతూ...కొత్త భవిష్యత్తు కలలు చూస్తూ...
అమ్మ ఒడిలో హాయిగా నిదురపోతూ...
బయటకు వెళ్ళిన పతి కోసం ఎదురు చూస్తూ...
ఆకసం లో విహంగం మృత్యువును కిందికి విడిస్తే....
ఒక్క క్షణం అంతా భస్మం అయిపోతే....
ఒక్క క్షణం లో అన్ని ఆశలు ఆవిరి అయిపోతే...
ఒక్క క్షణం లో బంగారు భవిష్యత్తు అంధకారం అయిపోతే...
రక్షకులే భక్షకులై పాలకులే రాక్షసులై...
ప్రాణాలు తీసుకుంటే...ఇంకెక్కడి దేశమది...
ఇంకెక్కడి రాజ్యమిది...
నాకిది కావాలంటే తండ్రి చంపేస్తే....
తప్పు చేస్తే తల్లి తల తీసేస్తే...
ఆ ప్రేమకు ఎక్కడ అర్ధం...
ఇక ఆ కుటుంబానికి ఏది పరమార్ధం...
ఏలే వాళ్ళు ప్రజలకు తల్లితండ్రులు కారా?
ఐతే మరి ఎందుకు ఈ దారుణం...
దేశం లో సాగే యుద్ధం లో ఆవిరయ్యే
అమాయకుల ప్రాణాలు...
ప్రభుత్వం చిట్టాలో తీవ్రవాదుల శవాలు...
తిండిలేక... మందులేక మరణించే మరికొందరు...
కనిపించరా వీరు మీకు ఏలికలూ...
శ్రీలంక అయినా, ఇరాక్ అయినా...
ఆఫ్ఘానిస్తాన్ అయినా...
ప్రాణం విలువ ఒక్కటే... యుద్ధం ఫలితం ఒక్కటే...
వేర్పాటువాదం సామ్రాజ్యవాదం మనలను యేలుతుంటే...
ప్రాణాలకు ఏది ఇక రక్షణ...జీవితాలకు ఏది ఇక భీమా..
( శ్రీలంక లో, ఇరాక్ లో, ఆఫ్ఘానిస్తాన్ లో,ప్రపంచం లో అన్ని మూలలలో యుద్ధానికి బలవుతున్న ఎందఱో అమాయక ప్రజలకుశ్రద్ధాంజలి.... మొగ్గలోనే వాడిపోతున్న ఎందరో పసిపిల్లల బంగారు భవిష్యత్తు కు ఇదే నా అశ్రుతప్త శ్రద్ధాంజలి)
No comments:
Post a Comment