అమ్మా.... ఒక ఇల్లుందట
ఇంట్లో అందమైన గూడు
స్వచ్ఛమైన నీరు... ఇక్కడిలా కాదు
అందమైన రాళ్లు.....మైమరిపించేలా
అతిధిలా.....సమయానికి భోజనం
విజేతల... ఆటల్లో కేరింతలు
ఎంత అందమైన జీవితం
ఎంత మధురమైన స్వప్నం
అని కళ్లు మూసినా ఒక క్షణం
ఏమైందో తెలియని అయోమయం.....
కళ్లు తెరిస్తే నా జీవితం.....
చేతులు మారుతున్న విక్రయం
పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్తున్నట్లు....
సముద్రం నుండి గాజుతోట్టి పయనం....
ఆ అందమైన జీవితం....
ఆ మధురమైన స్వప్నం......
చేతికందిన ఆనందం....
ఆ రంగురాళ్ళ గలగలలు...
స్వచ్ఛమైన నీటి బుడగలు....
వేళ కందే విందు బోజనాలు....
ఒక్క క్షణం కన్ను మూస్తే...
నా స్వర్గం చేరసాలయ్యింది.....
ఏది నను ఆట పట్టించే నేస్తం....
ఏది అనునయించే మాతృత్వం....
ఏది భోజనం కోసం వేటలో ఉండే ఉత్సాహం...
రంగు రాళ్ళున్నాయి.... విందు బోజనాలున్నాయి....
కాని స్వాత్రంత్యం ఏది?
స్వచ్ఛమైన నీళ్ళున్నాయి... కృతిమ పూలున్నాయి...
కాని ఆనందం ఏది?
రెండడుగుల చెరసాలలో.... రెండు క్షణాల జీవితం....
ఏమి చెప్పను తల్లీ...
చెరసాలను ఇల్లనుకున్నానని చెప్పనా...
నరకాన్ని స్వర్గమనుకున్నానని చెప్పనా?
నా లోకం వదిలి మరులోకం వెళ్ళాలన్న
ఆశ తో నన్ను నేను వదులు కున్నానని చెప్పనా...
నా లోకం తిరిగి వెళ్ళాలని అశ్రుతప్త
నయనాలతో ఎదురు చూస్తున్నానని చెప్పనా...
No comments:
Post a Comment